స్టూడెంట్లలో డ్రగ్స్ ప్రభావాన్ని నియంత్రించాలి : కలెక్టర్​ కుమార్​ దీపక్

నస్పూర్, వెలుగు: స్కూల్, కాలేజీల విద్యార్థులపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. డ్రగ్స్ నియంత్రణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై గురువారం కలెక్టరేట్​లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీలు రవికుమార్, వెంకటేశ్వర్, ఆబ్కారీ శాఖ అధికారి నందగోపాల్ తో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.

ప్రతి నెలా 3వ బుధవారం స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు  చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, గంజాయి ద్వారా కలిగే నష్టాలను అర్థమయ్యేలా ర్యాలీలు, వ్యాస రచన, ఆర్ట్, క్లబ్​లు ఏర్పాట్లు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. డీసీపీ మాట్లాడుతూ.. ఎక్కడైనా మత్తు పదార్థాల నిల్వ ఉన్నట్లు తెలిస్తే వెంటనే 100కు లేదా, హెల్ప్​లైన్ నంబర్ 14446కు  సమాచారం అందించాలని కోరారు. డీఈవో యాదయ్య, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్ రాజ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన, డ్రగ్స్ ఇన్​స్పెక్టర్ చందన తదితరులు పాల్గొన్నారు.